హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. మరో రెండ్రోజులు తీవ్రమైన చలి ఉంటుందని, ఉష్ణోగ్రతలు 6డిగ్రీలకు పడిపోయే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 33 జిల్లాల్లో కేవలం 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నది.
14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో అత్యల్పంగా 7 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 7.7 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 7 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొన్నది. మిగితా 18 జిల్లాల్లో 11 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.