వాజేడు, ఫిబ్రవరి 16: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ బాలుర వసతిగృహంలో చదువుతున్న పేరూరుకు చెందిన సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతిచెందాడు. విద్యార్థి తల్లి సోయం శైలకుమారి, మేనమామ తల్లడి శ్రీకాంత్ కథనం ప్రకారం.. పేరూరు బాలుర ఆశ్రమపాఠశాల లో 8వ తరగతి చదువుతున్న వినీత్‌కు జ్వరం రావడంతో శుక్రవారం ఇంటికి వచ్చాడు. శనివారం వాంతులు, విరోచనాలు అవడంతో కుటుంబ సభ్యులు ధర్మవరం ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆర్ఎంపీ సూచన మేరకు ఏటూరునాగారం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా హాస్టల్ నిర్వాహకులు తమకు తెలియజేయలేదని, ట్యాబ్లె ట్స్ వేయించి, పరిస్థితి చేయి దాటాక ఇంటికి పంపించారని వినీత్ తల్లి ఆరోపించారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం వినీత్ తల్లితోపాటు బంధువులు, ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర నాయకుడు నరసింహమూర్తి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు ఉయిక శంకర్ హాస్టల్ ఆవరణలో ధర్నా నిర్వహించారు.