మంచిర్యాల, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకోవడం లేదు. పూర్తిగా నయం కాకుండానే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్‌కు తరలించారు. బుధవారం 12 మంది విద్యార్థినులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యా రు. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స అం దించి గురువారం ఉదయం డిశ్చార్జి చేయగా, అదే రోజు సాయంత్రమే హాస్టల్‌కు తిరిగి వెళ్లిన 12 మందిలో నలుగురు వాంతులు చేసుకున్నారని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు శుక్రవారం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు సిక్ రూమ్‌లో ఉన్నారని తెలిసి వెళ్లి వారితో మాట్లాడుతుండగా, అప్రమత్తమైన సిబ్బంది వాంతులు చేసుకుంటున్న ఓ విద్యార్థినితోపాటు కడుపునొప్పితో బాధపడుతున్న మరో విద్యార్థినిని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. జనరల్ సర్జన్ విద్యార్థినులను పరీక్షించి ఫుడ్‌పాయిజన్ జరిగిన ఐదారు రోజులు ఇలాగే ఉంటుందని, కంగారు పడాల్సిన పనిలేదని చెప్పారు. విద్యార్థినులు పూర్తిగా కోలుకోకముందే హాస్టల్‌కు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు.
డైట్ చేంజ్ చేయకపోవడంతోనే సమస్య..
ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థినులకు సులభంగా అరిగే లైట్ ఫుడ్ పెట్టాలి. కానీ శుక్రవారం అందరితోపాటు వీరికి టమాట బాత్ పెట్టారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వెళ్లినప్పుడు విద్యార్థినులే స్వయంగా చెప్పారు. కాగా, విద్యార్థినులు మరోసారి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా శుక్రవారం సాయంత్రం పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. మీడియాను, విద్యార్థి సంఘాల నాయకులను లోపలికి అనుమతించకుండా, గేట్ వేసి మరి దాదాపు గంటపాటు విచారించారు. దీంతో అక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా మీడియాతో మాట్లాడారు. ఫుడ్, వాటర్ రిపోర్ట్ అన్ని సరిగానే ఉన్నాయని తెలిపారు. విచారణ చేయిస్తున్నామని, రిపోర్ట్ వచ్చాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్ జరిగినట్టు సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఖండించారు. ఫుడ్ పాయిజన్‌కు బాధ్యులైన వార్డెన్‌ను, ఏటీడబ్ల్యూవోను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నిలదీశారు.