హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న అశోక అకాడమీ డైరెక్టర్ పాలకూరి అశోక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. పోలీసుల నిర్బంధంతో గత 8 రోజులుగా దిల్సుఖ్నగర్ చైతన్యపురిలోని ఆయన ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్యోగం బాగా క్షీణిస్తుందని, పల్స్ రేటు పడిపోతుండగా, షుగర్ లెవల్స్ సైతం పడిపోయాయి. బీపీ కూడా పెరిగింది. తనను ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదని అశోక్ తెలిపారు.
కొనసాగుతున్న బక్క జడ్సన్ దీక్ష
నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆయన నివాసంలోనే కొనసాగుతున్నది. దీక్ష చేస్తున్న బక్క జడ్సన్ను బీఆర్ఎస్ నాయకులతోపాటు పలువురు నిరుద్యోగులు మంగళవారం పరామర్శించారు.
దిల్సుఖ్నగర్లో మరో విద్యార్థి ఆమరణ దీక్ష

డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ గోపి అనే విద్యార్థి ఆయన దిల్సుఖ్నగర్లో ఉంటున్న హాస్టల్లోనే మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి సమీక్ష చేయకుండా, షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్ణయిస్తామనడం సరికాదని చెప్పారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులమంతా నగరంలో మహాధర్నా చేపట్టామని, దీన్ని పోలీసులు అడ్డుకోగా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడమే లేదని ధ్వజమెత్తారు.