హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి సీఎం పదవికి అనర్హుడు. నిరుద్యోగుల కోర్కెలను నెరవేర్చకపోతే, వెంటనే సీఎం పదవి నుంచి దిగి పోవాలి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఇదే భావిస్తున్నారు’ అని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్ల పేరిట నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నారంటూ సీఎం చేసిన విమర్శలు దుమారం రేపాయి. కోచింగ్ సెంటర్లలో వంద కోట్ల దందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అశోక్ తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి కోచింగ్ సెంటర్లపైనా, పోటీ పరీక్షలపైనా, విద్యా వ్యవస్థపైనా అవగాహన లేదని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే వ్యక్తి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారని, అందుకే ఆయనకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో యోగ్యుడైన, చదువుకున్న మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
నిరుద్యోగులపైనా, తన కోచింగ్ ఇన్స్టిట్యూట్పైనా సీఎం కామెంట్ చేశారని, కానీ తన దగ్గర డీఎస్సీ కోచింగే లేదని వెల్లడించారు. రెండు నెలల్లో వంద కోట్లు వస్తాయని కామెంట్ చేశారని, మరీ 2 నెలల్లో వందకోట్లు వచ్చేదుంటే… ఇప్పటి వరకు తనకు 4, 5 వేల కోట్లు రావాల్సి ఉండేదని ఎద్దేవా చేశారు.
అవగాహనా రాహిత్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీఎస్సీని సెప్టెంబర్‌లో నిర్వహించి, గ్రూపు 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు పరీక్షలకు హాజరైనా మానసిక సంఘర్షణతో రాయలేని పరిస్థితి ఉంటుందన్నారు. గ్రూప్-1మెయిన్‌లో 1:100 నిష్పత్తి సాధ్యమేనని, 2004లో ఇదే పద్ధతిలో నిర్వహించినట్టు గుర్తుచేశారు.