హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): గవర్నర్ల నియామకాల్లోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ఉండగా.. ఆ రాష్ర్టానికే చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించింది. మరోవైపు పదవీకాలం ముగిసిందనే సాకుతో తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ పదవి నుంచి తప్పించింది.
ఆయనను కొనసాగించే అవకాశం ఉన్నా కేంద్రం పరిగణించకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నా.. వారి పేర్ల ను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీకి పెద్దపీట వేస్తున్న కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది.