నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 20 : తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించారు. వందల మంది కార్యాలయ గేటు లోపలికి వచ్చి గంటకుపైగా బైఠాయించారు. కనీస వేతనం పెంపు, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని నినదించారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వారు ససేమిరా అన్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ముట్టడి సందర్భంగా గంటకుపైగా ఎండలో కూర్చోవడంతో ధర్మపురి మండలం గాదెపల్లికి చెందిన ఆశా కార్యకర్త వెలుగు లక్ష్మి సొమ్మసిల్లి పడిపోవడంతో దవాఖానకు తరలించారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని దాదాపు 300 మంది ఆశా కార్యకర్తలు ముట్టడించారు.
ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడగా, ఎకడికకడ ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురికి గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయం, నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి శ్రీహరి ఇంటికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు సంగంబండ రోడ్డులో అడ్డుకోవడంతో బారికేడ్స్‌ను తోసుకుంటూ మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు. హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆశా వర్కర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రెండు గంటలకుపైగా అకడే బయట నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ములుగులోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.