ఖమ్మం: నూతన సంవత్సరం మొదటిరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. రాజమండ్రి నుంచి పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ కర్మాగారానికి వస్తున్న ఓ యాష్ ట్యాంకర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. పుల్లూరు గూడెం వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇండ్లలోకి దూసుకుపోయింది. చివరికి ఓ ఇంటిగోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్న శీలం కోటేశ్వరమ్మ గార్లపాటి వెంకట నరసమ్మ అనే మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పాల్వంచ పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు ప్రవీణ్, రితీష్ కుమార్ వెంటనే అక్కడి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఈ లారీ బీభత్సంలో ఓ ఇంటి ముందు పార్కుచేసి ఉన్న ఆటో కూడా ధ్వంసమయ్యింది.