 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో ఏం జరుగబోతున్నదో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు (Mahesh Kumar Goud) కనీస సమాచారం లేదని, ఆయన కంటే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) వద్దే స్పష్టమైన సమాచారం ఉన్నదని కాంగ్రెస్ (Congress) నేతలు సెటైర్లు వేస్తున్నారు. అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా? శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా?అని మీడియా ప్రతినిధులు బుధవారం మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ క్యాబినెట్ విస్తరణకు సంబంధించిగానీ, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఫైనల్ అయినట్టుగానీ తనకు సమాచారం లేదని పేర్కొన్నారు.
అజారుద్దీన్ మంత్రి పదవిపై టీవీల్లో వస్తున్న సమాచారమే తప్ప అధిష్ఠానం నుంచి ఎలాంటి సందేశం లేదని స్పష్టంచేశారు. పైగా శుక్రవారం క్యాబినెట్ విస్తరణ ఏర్పాట్లపై కూడా సమాచారం లేదని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో ఇదే ప్రశ్నను మీడియా ప్రతినిధులు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని అడుగగా.. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ను మంత్రిగా నియమిస్తున్నదని, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. దీంతో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చెప్పకుండా అధిష్టానం గోప్యంగా ఎందుకు ఉంచిందా? అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో ప్రచారంలోకి రావటంతో గురువారం నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో మహేశ్‌గౌడ్ మాటమార్చారు. అజారుద్దీన్ క్యాబినెట్లోకి రావటం ఖాయమని, బీజేపీ అడ్డుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు.
 
                            