Dengue | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. ఏడు నెలల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటింది. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యంపైగానీ, దోమల నివారణపైగానీ, వైద్యారోగ్యశాఖ దవాఖానల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘దోమల నివారణకు చర్యలు తీసుకోండి’ అంటూ హడావుడి సమీక్షలు, ఆదేశాలు, ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని ఆరోపణలు ఉన్నాయి.
ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు పెరుగుతాయని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. డెంగ్యూలోని నాలుగు ప్రధాన వేరియంట్లు డీఈఎన్వీ-1, డీఈఎన్వీ-2, డీఈఎన్వీ-3, డీఈఎన్వీ-4 రాష్ట్రంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలో 1078 డెంగ్యూ కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇది అధికారికంగా చెప్పిన లెక్క లు మాత్రమే. అనేక ప్రైవేట్ దవాఖానలు డెంగ్యూ కేసులను రిపోర్ట్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు 706 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి 52 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో మలేరియా కూడా విజృంభిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు 78 మలేరియా కేసులు నమోదయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటినప్పటి నుంచి గ్రామా లు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి నెల నిధులు విడుదల చేయలేదు. ఏడు నెలల్లోనే దాదాపు రూ.3వేల కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్టు చెప్తున్నారు. పల్లెల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనలేని పరిస్థితి నెలకొన్నదనే ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య లోపంతో దోమలు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కారు వచ్చిన ఆరునెలల్లోనే ప్రభుత్వ దవాఖానాల్లో మందు గోళీలు కూడా దొరకని దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. సర్కారు వైద్యానికి కేసీఆర్ ప్రభుత్వం జవసత్వాలు ఇచ్చి, పోదాం పదరో సర్కారు దవాఖానాకు అనే ధీమానిచ్చిందని చెప్పారు.