జగిత్యాల, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): డిజిటలైజేషన్ దెబ్బకు కుదేలై బతుకుదెరువు కోల్పోయిన చిత్రకారుల జీవితంలో తె లంగాణ ప్రభుత్వం రంగులద్దింది. ఫ్లెక్సీల రాక తో బతుకులు అంధవికారమై వృత్తికి దూరమవుతున్న కుంచె కళాకారులకు అండగా నిలిచిం ది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే తరుణంలో ఆర్టిస్టులకు బతుకుదారి చూపింది. రంగులు వెలిసిన తమ జీవితాల్లో మళ్లీ ఇంద్రధనుస్సును మెరిపించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందంగా చెప్తున్నారు జగిత్యాలకు చెందిన పలువురు చిత్రకారులు.
ప్రభుత్వ చర్యలతో పూర్వవైభవం
తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ఆర్టిస్టులకు పూర్వవైభవం తెచ్చింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యాక్రమాల్లో భాగంగా చేపట్టిన ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల్లో అందమైన బొమ్మలు వేసే పనిని ఆర్టిస్టులకు అప్పగించింది. దాంతోపాటు పల్లె ప్రగతిలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలపై స్వచ్ఛత ఆవశ్యకతను తెలిపే స్లోగన్లను రాయాలని సూచించింది. వీటితోపాటు గ్రామ పంచాయతీలు, పాఠశాలలు ఇతర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనులు చిత్రకారులకు వరంలా మారాయి. పల్లెల్లో ఎక్కడ చూసినా, కళాకారులు వేసిన అందమైన బొమ్మలు, చేతిరాతలే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు ఆదాయం, మరో వైపు తమ పనితనం, సంతృప్తి మొత్తంగా ఆర్టిస్టుల సంతోషకరమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత మూడేండ్లుగా జిల్లాలోని దాదాపు 50 మంది ఆర్టిస్టులు రికాం లేకుండా పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటా
సీఎం కేసీఆర్ సార్‌కు ఆర్టిస్టులు, కళాకారులు ఎల్లప్పుడు రుణపడి ఉంటారు. నాలుగేండ్ల క్రితం నెలకు వెయ్యి రూపాయలు ఆదాయం సైతం లేని పరిస్థితి నుంచి నేడు తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఏడాదిలో రూ.10 లక్షలు ఆర్జించిన కళాకారులు ఉన్నారు. జగిత్యాలతోపాటు కాదు, చుట్టుపక్కల జిల్లాలకు వెళ్లి పనిచేస్తున్నారు. 24 గంటలు పనిచేసినా ఒడవనంత పని ఉన్నది. పాఠశాలల్లో రంగులు, బొమ్మలు వేసి అక్షరాలు రాసే పని మొదలు అవుతుందంటున్నారు. ఈ పనులు ప్రారంభమైతే కళాకారులకు మరో పదేండ్ల వరకు ఢోకా ఉండదు. ఇదంతా సీఎం కేసీఆర్ చలువే.
– సింగని శ్యాం, ఆర్టిస్టు, రాయికల్, జగిత్యాల జిల్లా