హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పశు సంపదను వృద్ధిచేయడంతోపాటు, మేలుజాతి ఆవులు, బర్రెల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ పశు గణాభివృద్ధి సంస్థ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయింది. కృత్రిమ పిండాన్ని నాటు పశువుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా మేలుజాతి పశుసంపదను పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రయత్నాలు చేస్తున్నది. పేరెన్నికగల సాహివాల్ వంటి మేలు రకం జాతి పశువుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా ఫలదీకరణ చేస్తారు. ఈ విధంగా ఫలదీకరణ చెందిన అండాన్ని స్వదేశీ పశువుల్లోకి ప్రవేశపెట్టనున్నారు. తద్వారా మేలు రకం జాతికి చెందిన దూడలు జన్మించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉన్నది. తొలి దశలో భాగంగా కరీంనగర్ జిల్ల్లా కోరుట్లలో 8 ఆవుల్లోకి ఫలదీకరించిన అండాన్ని ప్రవేశపెట్టారు. మరో 50 అండాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి.
పశువుల్లో ఈరకం కృత్రిమ గర్భధారణ ప్రయోగం విజయవంతమైతే పాడి పరిశ్రమలో గొప్ప పురోగతిగా చెప్పుకోవచ్చు. మేలు రకపు బర్రెలు, ఆవులతో అధిక మొత్తంలో పాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగడంతోపాటు, రైతులకు ఆదాయం కూడా పెరుగుతుంది. రూ.లక్షలు ఖర్చు చేసి మేలురకం ఆవులు, బర్రెలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. పశు సంపదను అభివృద్ధిచేసేందుకు రాష్ట్రంలో ఇప్పటికే కృత్రిమ గర్భధారణ నిర్వహిస్తున్నారు. దీనికి తాజాగా ప్రయోగం మరో ముందడుగుగా చెప్పవచ్చు.
రాష్ట్రంలో మేలురకం పశుసంపదను వృద్ధి చేసేందుకు తొలిసారిగా మేలు జాతి పశువుల ఫలదీకరించిన అండాన్ని ప్రవేశపెట్టే ప్రయోగం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఎనిమిది ఆవులకు ఈ రకం గర్భధారణ జరిపే ప్రయోగం విజయవంతమైంది. మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ ప్రయోగాన్ని రైతులను ఒప్పించి క్షేత్రస్థాయిలోనే నిర్వహిస్తున్నాం.
మంజువాణి, సీఈవో, పశుగణాభివృద్ధి సంస్థ