హైదరాబాద్ : ‘సొంతలాభం కొంతమానుకొని పొరుగువానికి సాయపడవోయ్’ అన్నారు మహాకవి గురజాడ. అదే స్ఫూర్తిని అణువణువునా నింపుకొన్న ఓ మంచి కార్యక్రమం ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ (Art of Giving ) . ప్రముఖ విద్యావేత్త, మానవతామూర్తి అచ్యుత సామంత ( Achyuta Samanta ) 13ఏళ్ల కిందట ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విశ్వశాంతికి, మానవీయ విలువల పరివ్యాప్తికి ‘సేవాభావం, దాతృత్వగుణానికి’ మించిన మార్గం లేదన్నది ఆయన విశ్వాసం. పరులకు సాయం అందించడంలోనే అసలైన ఆనందం దాగుందన్న జీవిత సూత్రాన్ని పదిమందికి తెలియజెప్పాలనే సంకల్పంతో ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ మొదలుపెట్టారు.

అందులో భాగంగా పి. రాజారమేష్ ( Raja Ramesh ) సారధ్యంలో మే11 నుంచి మే17 వరకు ‘షేర్ టు షైన్’ (పంచుకోవడంలోనే ఆనందం) నినాదంతో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఆర్ట్ ఆఫ్ గివింగ్(ఏఓజీ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఏఓజీ కార్యకర్తలు చేపట్టిన సేవా వారోత్సవాల్లో యువజన సంఘాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 400మంది ఆర్ట్ ఆఫ్ గివింగ్ కార్యకర్తలు గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల్లో ‘షేర్ టు షైన్’ ( Share to Shine ) నినాదంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వాలీబాల్ కిట్ల పంపిణీ

ఈ ఏడాది ‘షేర్ టుషైన్’ నినాదంలో భాగంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో
యువతకు, విద్యార్థులకు ఏఓజీ కార్యకర్తలు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు యువతను సానుకూల దృక్పథం వైపు నడిపించడానికి ఈ కార్యక్రమం తోడ్పడాలన్నది అచ్యుత సామంత ప్రధాన ఉద్దేశం. ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా ఆర్ట్ ఆఫ్ గివింగ్ వారోత్సవాల్లో భాగంగా పలు గ్రామాలు, బస్తీలు, విద్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆహార పంపిణీ, రక్తదాన శిబిరాల నిర్వహణ, పేద విద్యార్థులకు అభ్యాస సామాగ్రి అందజేత, మొక్కలు నాటడడం, ఆరోగ్య అవగాహనా సమావేశాలు వంటి రకరకాల సేవాకార్యక్రమాలు ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త పి. రాజా రమేష్ నేతృత్వంలో జరిగాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. అచ్యుత సామంత సేవాభావాన్ని, ఏఓజీ బృంద కృషిని ప్రశంసించారు.
200 దేశాల్లో ఉద్యమం..

ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం కేవలం నిరుపేదలకు సహాయ, సహకారాలు అందించడంవరకే పరిమితం కాదు. దాతల విలువైన సమయాన్ని, విజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి దోహదపడాలన్నది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంలో అంతర్భాగం అని అచ్యుత సామంత వివరించారు.మానవాళిని మరింత మానవీయం చేసేందుకు ఉపకరించే ‘పరులకు సాయం అందించడంలోనే అసలైన ఆనంద’మని దేశదేశాల్లో అచ్యుత సామంత ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ మహోన్నత ఆలోచనను ఇతర దేశాలకూ పరిచయమైంది.
ప్రస్తుతం సుమారు200కుపైగా దేశాలకు ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ విస్తరించింది అని రాజా రమేష్ తెలిపారు.
గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య..

బాల్యంలో తనకు అనుభవమైన పేదరిక బాధలు మరొకరికి ఉండకూడదన్న సంకల్పంతో 13ఏళ్ల కిందట ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ ఉద్యమానికి ఆచార్య అచ్యుత సామంత శ్రీకారం చుట్టారు. కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైస్సెస్(కిస్) విద్యాసంస్థ ద్వారా సుమారు 40వేల మందికిపైగా గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు కిండర్ గార్డెన్ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు పూర్తిగా ఉచిత విద్యను అచ్యుత సామంత అందిస్తున్నారు. ఇప్పటికే కొన్నివేల మంది అదే విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తిచేసి, ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తద్వారా అందమైన భవితవ్యాన్ని నిర్మించుకున్నారు.
సామాజిక అంతరాలు తగ్గించి… సాయం అందించేవారు, తీసుకునేవారు అనికాకుండా, సమాజంలో ఒకరికొకరు సహానుభూతితో మెలిగేలాంటి ఓ సామరస్యపూర్వకమైన సమజాన్ని నిర్మించడమే ఆర్ట్ ఆఫ్ గివింగ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. అచ్యుత సామంత ఇచ్చిన పిలుపుతో ఆయన అభిమానులు, కార్యకర్తలు 400మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాల్లోని ఆర్ట్ ఆఫ్ గివింగ్ వారోత్సవంలో పాల్గొన్నారు. ‘