హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి, దొంగ జీవోల ద్వారా రాష్ట్రంలోని 10 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని నమ్మించి.. 2022లో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. జీవో నంబర్ 87తో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లిందని వాపోతున్నారు. కానిస్టేబుల్ వయోపరిమితిని కేవలం 32 ఏండ్లకు మాత్రమే వెలుసుబాటు ఇవ్వడం దారుణమని, ఓసీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు పరిమితి ఇవ్వడం అన్యాయమని అంటున్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. యూనిఫాం సర్వీసెస్‌కు సిద్ధపడుతున్న సుమారు 10 లక్షల మంది అభ్యర్థులకు 35 ఏండ్లకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద విద్యార్థుల సామాజిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతి రెండేండ్లకు ఒకసారి నోటిఫికేషన్లు వేస్తూ వయోపరిమితిని 32 సంవత్సరాల వరకు పెంచి అండగా నిలిచిందని జేఏసీ ప్రతినిధులు గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి, తీరా గద్దెనెకిన తర్వాత మాట తప్పిందని మండిపడుతున్నారు. చివరిగా 2022లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందని, కాంగ్రెస్ వచ్చాక 2026 మే వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి మానసిక వేదన అనుభవిస్తున్నారని కన్నీటి పర్యమంతవుతున్నారు. జీవో-87 ద్వారా ఉద్యోగార్హతను కేవలం 32 సంవత్సరాలకే పరిమితం చేస్తూ నిరుద్యోగుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. వయోపరిమితి 35 ఏండ్లకు పెంచి.. తక్షణమే 20వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకపోతే లక్షమందితో డీజీపీ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.
పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు సీఎం యాదగిరిగుట్ట పర్యటనను అడ్డుకుంటారేమోనన్న అనుమానంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో ముందుస్తుగా అరెస్టు చేసి, సరూర్‌నగర్ పీఎస్‌కు తరలించారు. జూన్ 2 లోపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే సీఎం క్యాంపు కార్యాలయం, డీజీపీ ఆఫీసులను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, దొంగ జీవో నంబర్ 87ను వెంటనే సవరించి, నూతన నోటిఫికేషన్లలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచుతూ కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణను పరిగణనలోకి తీసుకొని తక్షణమే న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అభ్యర్థులు న్యాయమైన పోరాటానికి సిద్ధం కావాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం కొనసాగించాలని జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్, శింబు నాయక్ పిలుపునిచ్చారు.