కరీంనగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చొప్పదండి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. దహనం చేస్తున్న సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ను, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయాక ఇదేరోజు రాత్రి ఒక్కో నాయకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇదే రోజు రాత్రి కరీంనగర్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
చొప్పదండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి శేఖర్‌ను కూడా పోలీసులే అరెస్టు చేసి ఉంటారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డిని కూడా చొప్పదండి పోలీసులు గురువారం రాత్రే అరెస్టు చేశారు. నిరసన కార్యక్రమాలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని వదిలేశారని, మళ్లీ రాత్రి పూట ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని, దీని వెనక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఉన్నదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేస్తున్నారు. మల్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొరండ్ల నరేందర్‌రెడ్డిని గంటన్నర పాటు స్టేషన్లో నిర్బంధించారు.