Kerala | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : అధిక వడ్డీల పేరిట ఆశచూపి సుమారు రూ.12.54 లక్షలు మోసం చేసిన కేసులో కేరళకు చెందిన ఇద్దరు వైట్కాలర్ నేరస్థులను రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 29 ఏండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. కేరళకు చెందిన సుమారు పది మంది వ్యక్తులు 30 ఏండ్ల క్రితం హైదరాబాద్లో ‘ట్రావెన్కోర్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ కంపెనీ’ పేరుతో ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించారు.
అధిక వడ్డీలు ఆశచూపి, పేపర్లలో ప్రకటనలిచ్చి, ప్రజల నుంచి సుమారు రూ.12,54,915 సేకరించారు. ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికి రాగానే బోర్డు తిప్పేసి కేరళకు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు 1994లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన టామీ, షెర్లీ టామీ, జోసెఫ్లను అరెస్టు చేశారు. అప్పట్లో వీరి నుంచి రూ. 94,921 నగదు రికవరీ చేశారు. అనంతరం ఈ కేసులో బెయిల్ పొందాక కోర్టుకు హాజరుకాకపోవడంతో వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సీఐడీ పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి.. టామీ, సీఐ జోయ్ అలియాస్ జోసెఫ్లను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.