హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ‘ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై భారీగా ఖర్చు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది’ – గత సంవత్సరం పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గత సంవత్సరం జనవరి నుంచి తమకు రావాల్సిన దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఎరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 మంది జూనియర్ డాక్టర్ల (పీజీ డాక్టర్లు, ఇంటర్న్స్ (హౌస్ సర్జన్లు)కు ఒక్కొక్కరికి రూ.50,000కు పైగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. వీరంతా తమ పీజీ వైద్య విద్య పూర్తయిన తర్వాత సీనియర్ రెసిడెంట్లు (ఎస్ఆర్)గా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సేవలు అందిస్తున్నారు. అయితే, వీరికి గత సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలలకు సంబంధించి రూ.8 కోట్ల వరకు ఎరియర్స్‌ను చెల్లించలేదు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న తమకు ఏడాది గడిచినా ఏరియర్స్ చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
సర్కార్‌పై మండిపాటు
2021 బ్యాచ్‌కు చెందిన పీజీ డాక్టర్లు, ఎండీ పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా ఇప్పటికే పనిచేస్తున్న వారు, 2022 బ్యాచ్ పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా చేరిన వారు, హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ డాక్టర్లు తమ ఎరియర్స్‌ను పూర్తిగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నదని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, డీఎంఈకి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే, బడ్జెట్ డీఎంఈ పరిధిలో ఉన్నదంటూ కాలం వెల్లదీస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ బకాయిలకు సంబంధించిన ఫైల్ ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదని జూనియర్ డాక్టర్లు తెలిపారు.