Keesara | కీసర, ఫిబ్రవరి 15: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి మార్చి ఒకటోతేదీ వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఆరు రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, కీసర దేవస్థానం సంయుక్తంగా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇప్పటికే రెండుసార్లు వివిధ శాఖల అధికారులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ రెండు సార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. కీసరగుట్టలో భవానీ రామలింగేశ్వర స్వామి దర్శకానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని వివిధ శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
కీసరగుట్టలో ఆర్ అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో భారీగేడ్లు, వాహనాల పార్కింగ్ కోసం ఆర్యవైశ్య సంఘం సమీపంలో, వేదపాఠశాల దగ్గర వెహికల్ పార్కింగ్ కోసం బుల్డోజర్తో చదును చేస్తున్నారు. ఇంకా కీసరగుట్టలోని నందీశ్వరుడి వద్ద భక్తులు క్యూలైన్లో వెళ్లడానికి చలువ పందిళ్లు, భారీగేడ్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని స్థలం చక్కగా తీర్చి దిద్దారు.
కీసరగుట్టలోని స్వామివారి సమీపంలోనే ఈ సారి కల్యాణ మహోత్సవం వేడుకల నిర్వహణకు ఆలయ చైర్మన్.. ఆలయ సిబ్బందితో పనులు చేపడుతున్నారు. భక్తులు సేద తీర్చుకోవడానికి చక్కటి చలువ పందిళ్ల పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయం లోపల వెదురుబొంగులతో క్యూలైన్ల నిర్మాణ పనులను చకచకా చేపడుతున్నారు.
కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం, ప్రభుత్వం ఆధ్వర్యంలో తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని కీసర భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ తెలిపారు. ఈ సారి ప్రత్యేకంగా స్వామివారి పక్కనే ఉన్న అనువైన స్థలంలో స్వామి వారి కల్యాణం నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కీసరగుట్టలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కరపత్రాలను పంపించామని తటాకం నారాయణ శర్మ వెల్లడించారు.