నిజామాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటూ గర్జించిన దాశరథి కృష్ణమాచార్యుల అక్షర ఆగ్రహానికి వేదికైన నిజామాబాద్ జిల్లాలోని ఇందూర్ ఖిల్లా (పురాతన కారాగారం) ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు పక్కనే గుట్టపై నిర్మించిన చారిత్రక ఖిల్లా ప్రాంతం పునరుద్ధరణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.40 లక్షలు కేటాయించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాడుబడిన జైలులో ఆధునీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నేటి తరానికి దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి ప్రముఖుల జీవిత విశేషాలను తెలిపేందుకు, వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు కృషి చేస్తున్నారు. దాశరథి, వట్టికోట విగ్రహాలతోపాటు నలుగురు పోలీసుల విగ్రహాలను బ్యారక్‌లో ఏర్పాటు చేస్తున్నారు. జూలై 22న దాశరథి జయంతి రోజున దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్‌కు నైరుతి దిశలో ఉన్న ఖిల్లాను 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు. భూ ఉపరితలం నుంచి 300 మీటర్ల ఎత్తులోని ఖిల్లా పక్కనే రఘునాథ ఆలయం ఉంది. ఛత్రపతి శివాజీ తన గురువైన సమర్థ రామదాసు ఆదేశాల ప్రకారం శ్రీరామ దేవాలయాన్ని 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయంలో 53 అడుగుల ఎత్తుతో దీప స్తంభం ఉంది. 1311లో కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తదనంతరం కుతుబ్‌షా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత నిజాం చేతిలోకి మారింది. అసఫ్ జాహీల కాలంలో ఖిల్లా కాస్త జైలుగా మారింది. తెలంగాణ సాయుధ పోరాటంలో యోధులను ఇందులోనే నిర్బంధించారు. మహాకవి దాశరథి, వట్టికోట, సర్దా ర్ జమలాపురం కేశవరావు ఇక్కడే శిక్ష అనుభవించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత కూడా ఖిల్లా జైలుగానే కొనసాగింది. పదేండ్ల క్రితం వరకు కారాగారంగానే కొనసాగింది. ఇక్కడి జైలును సారంగాపూర్ సమీపంలోని నూతన బిల్డింగ్‌కు తరలించడంతో ఈ చారిత్రక ప్రాంతం ఖాళీగా మారింది. ఈ ప్రదేశం ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటున్నది.
నిజాం వ్యతిరేక పోరాటంలో భాగంగా దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి 1948లో నిజామాబాద్ జైలులో శిక్షను అనుభవించారు. 1949లో దాశరథి రచించిన ‘అగ్నిధార’ కావ్యాన్ని ప్రచురించగా ఇందులో కనీసం సగం కవితలు ఈ జైలులో రాసినవేనని చరిత్రకారులు చెప్తున్నారు. ఆళ్వారుస్వామి 1955లో ప్రచురించిన ‘ప్రజల మనిషి’ నవలలో హీరో కంఠీరవం జైలు జీవి తం గురించి తెలియజెప్పిన ఒక అధ్యాయం అంతా ఇక్కడి అనుభవాలేనట. వట్టికోట రాసిన ‘జైలు లోపలి కథలు’ అనే కావ్య సంపుటిలోనూ ఆయన స్వీయ జైలు అనుభవాలు ఉన్నాయి. ‘అగ్నిధార’ మలి ముద్రణ 1963లో జరిగింది. ఆనాడు ‘పురాస్మృతులు’ శీర్షికన దాశరథి ముందుమాట రాస్తూ ‘అగ్నిధార’ను అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ పద్యాలు దాశరథి జైలు గోడలపై రాశారు. 1948 జనవరి 30న గాంధీ మరణించినప్పుడు ‘క్షమామూర్తి’ అనే సంస్మరణ పద్యాన్ని దాశరథి జైలులోనే రాశారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి శిక్ష అనుభవించిన దాశరథి, వట్టికోట జైలు లోపలా అదే పదునుతో కలాన్ని ఎక్కుపెట్టి అక్షరాలను సంధించారు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని బొగ్గుతో రాసిన జైలు గదితోపాటు మిగిలిన వాటిని సుందరీకరిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ప్రాంతాన్ని సుందరంగా రూపొందించడంతోపాటు దాశరథి, వట్టికోట విగ్రహాలను జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేయిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా జూలై 22న ఇందూరు ఖిల్లా జైలు పునరుద్ధరణ ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వేయి మంది కళాకారులతో ప్రదర్శనలు, 200 మంది సాహితీవేత్తలతో సాహిత్య సమ్మేళనాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ ఖిల్లాలోని రఘునాథ ఆలయానికి ప్రాధాన్యం ఏర్పడింది. గుట్ట పై రోడ్డుతోపాటు ఇతర వసతులు కల్పించబడ్డాయి. పక్కనే ఉన్న రఘునాథ చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. నిజామాబాద్ ట్యాంక్ బండ్‌ను పర్యాటకులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.
దాశరథికి వందనం
తెలంగాణ వైతాళికులు దాశరథి, వట్టికోట ఆళ్వా రు స్వామి జీవితాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాం బానిస సంకెళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారంతా జైలు గోడల మధ్య కూడా తమ గొంతుకను వినిపించారు. నా తెలంగాణ కోటి.. రతనాల వీణ అంటూ జైలు గోడలపై కాగితం, సిరా చుక్క లేకుండానే బొగ్గుతో రాసిన ఘనమైన చరిత్ర దాశరథి కృష్ణమాచార్యులది. నిజామాబాద్ ఖిల్లా జైలు ఆధునీకరణకు ఎమ్మెల్సీ కవిత పూనుకోవడం గొప్ప విషయం.
– ఘనపురం దేవేందర్, హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు
మహనీయులకు గుర్తింపు
నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా జైలును సందర్శిస్తే దాశరథి, వట్టికోట ఆళ్వార్‌స్వామి పోరాట పటిమ తెలుస్తున్నది. చీమలు దూరని జైలు గోడల మధ్య.. జైలు జీవితాన్ని గడపడం అదొక చరిత్ర. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టి కేంద్రీకరించడం ద్వారా ఖిల్లా జైలు గొప్పతనం నేటి తరానికి అందుబాటులోకి రానున్నది. ఆధునీకరణ కోసం రూ.40 లక్షల ఎమ్మెల్సీ నిధులు ఇచ్చారు. దాశరథి, వట్టికోట విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాం.
– నవీనా ఆచారి, భారత జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి