హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార తెలిపారు. శనివారం సచివాలయంలో ఉత్సవాల నిర్వహణపై జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఎన్నో విప్లవాత్మక, ఊహకు అందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అధివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని తెలిపారు.
మూతపడిన కమలాపూర్ రేయాన్స్ పరిశ్రమను రూ.4వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామని, గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేస్తామని వివరించారు. స్పోర్ట్ యూనివర్సిటీకి శంకుస్థాపన,16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం, పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
చివరి రోజున హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్‌షోలు, క్రాకర్స్ ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ముఖ్య కార్యదర్శులు రవిగుప్తా, క్రిస్టినా జోంగ్తు, ఎం శ్రీధర్, కార్యదర్శి దాసరి హరిచందన, లోకేశ్ కుమార్ పాల్గొన్నారు.