Singareni | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు. టీబీజీకేఎస్, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఇప్టూ వంటి సంఘాలు పోటీపడుతున్నా.. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్, కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్యే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ వీటి అనుబంధ కార్మిక సంఘాలైన ఎన్ఐటీయూసీ, ఏఐటీయూసీ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి.
వాయిదాకు యత్నాలు
ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ అసలివి జరుగుతాయా? అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లి ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పనిచేసిన సంఘాలే మళ్లీ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. సింగరేణిలో బలమైన టీబీజీకేఎస్‌కు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కార్మికులకు లబ్ధి చేకూర్చే 60కి పైగా డిమాండ్లను సాధించడం, వారసత్వ ఉద్యోగాలు వంటి అనేక విజయాలను టీబీజీకేఎస్ సాధించింది. గత రెండు ఎన్నికల్లో అన్ని చోట్లా టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఈసారి కూడా దానికే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల విశ్వాసాన్ని చూరగొనలేక పట్టు కోల్పోయాయి. ఎన్నికలను వాయిదా వేయించి, బలం పుంజుకున్న తర్వాత ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు కార్మికవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, మరో ఒకటి రెండ్రు రోజుల్లోనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.
84 పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పోలింగ్ కోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. కార్పొరేట్ ఏరియాలో ఐదు, కొత్తగూడెంలో ఆరు, ఇల్లెందులో మూడు, మణుగూరులో ఏడు, రామగుండం-1లో 11, రామగుండం- 2లో ఆరు, రామగుండం- 3లో ఆరు, భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో 5, మందమర్రిలో 11, శ్రీరాంపూర్ లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజే రాత్రే ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం 12 ఓట్ల లెకింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కార్మికశాఖ తెలిపింది.