హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు డిస్కంలు దాదాపు రూ.20 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. వాటి ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం అంతకంతకు పెరుగుతున్నది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలిపితే ఈ రెండు డిస్కంల ఆర్థిక లోటు రూ.20 వేల కోట్లు ఉంటుందని, సబ్సిడీని మినహాయిస్తే ఈ లోటు రూ.6 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ డిస్కంలకు సరిపోవడం లేదు. అందుకే అవి ఆర్థికంగా అవస్థలు పడుతున్నాయి. ఇదే విషయాన్ని రెండు డిస్కంలు విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి వివరించేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకోసం వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఏఆర్)ను సిద్ధం చేసే పనిని ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించాయి. ఆ నివేదిక రాగానే ఈ నెలాఖరులోగా ఈఆర్సీకి సమర్పించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి.
డిస్కంలు ఏటా నవంబర్ 30లోపే ఏఆర్‌ఆర్‌ను ఈఆర్సీకి సమర్పించాలి. ఈ ఏడాది నవంబర్ 30 ఆదివారం కావడంతో ముందుగానే ఈఆర్సీకి నివేదికను సమర్పించాలని డిస్కంలు భావిస్తున్నాయి. ఆ నివేదికను ఈఆర్సీ తన వెబ్సైట్లో పొందుపర్చి, వినియోగదారుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఆ తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి, 2026-27 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌ను ఖరారు చేస్తుంది. రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా విద్యుత్తు చార్జీలను పెంచకపోవడంతో సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే ఆర్థికంగా సర్దుబాటు చేస్తున్నది. రెవెన్యూ లోటును తీర్చేందుకు గృహజ్యోతి, సబ్సిడీల కింద ప్రస్తుతం నెలకు రూ.980 కోట్లు మాత్రమే ఇస్తున్నది. కానీ, ఆ సబ్సిడీ డిస్కంలకు ఏమాత్రం సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలో సబ్సిడీని పెంచాలని, నెలకు రూ.1,500 కోట్లు ఇవ్వాలని విద్యుత్తురంగ నిపుణులు సూచిస్తున్నారు. డిస్కంలు కూడా ఇదే కోరనున్నట్టు తెలిసింది. సబ్సిడీ మొత్తాన్ని పెంచాలని లేదంటే చార్జీలు పెంపునకు అనుమతించాలని విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం.
వాస్తవానికి ఈ ఏడాది డిస్కంల ఆర్థికలోటు స్వల్పంగా తగ్గింది. గతంలో సబ్సిడీ పోను రూ.10 వేల కోట్ల లోటు ఉండేది. ఇప్పుడు అది రూ.6 వేల కోట్లకు చేరింది. ఈసారి విద్యుత్తు కొనుగోలు వ్యయం భారీగా తగ్గింది. ఏడాది కాలంలో దాదాపు రూ.4,000 కోట్ల మేరకు తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. దీనితోపాటు మరికొన్ని అంశాలు డిస్కంలకు కలిసొచ్చాయి. ఈసారి జల విద్యుత్తు ఉత్పత్తి పెరిగింది. 2022-23లో 6,057 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకే 6,074 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీంతో బయట విద్యుత్తు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. మరోవైపు సౌర విద్యుత్తు అత్యంత చౌకగా లభిస్తున్నది. గుజరాత్ సహా పలు రాష్ర్టాల నుంచి ఒక్కో యూనిట్ సౌర విద్యుత్తు రూపాయిలోపే లభిస్తుండం, అప్పులపై వడ్డీ శాతం తగ్గడం డిస్కంలకు సానుకూలంగా పరిణమించింది.
ప్రస్తుతం హెచ్‌టీ వినియోగదారులకు ఇస్తున్న నైట్ ఇన్సెంటివ్ త్వరలో రద్దు కానున్నది. టైమ్ ఆఫ్ ది డే టారిఫ్‌లో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్తు వాడుకున్నవారికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న ప్రోత్సాహకాన్ని డిసెంబర్ 1 నుంచి రద్దు చేసేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్‌టీ వినియోగదారులపై ఏటా రూ.1,000 కోట్ల వరకు భారం పడనున్నది. ఈ భారాన్ని పరిశ్రమలు, కోళ్ల ఫారాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు ప్రార్థనామందిరాలపై మోపనున్నారు.