వరంగల్ చౌరస్తా, జనవరి 7: ఈనెల పదో తేదీ నుంచి ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిటీ ఈ మేరకు తీర్మానం చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుండటంతో సేవల నిలిపివేయక తప్పడం లేదని అన్నారు. ఈనెల పదో తేదీలోగా ప్రభుత్వం స్పందిం చి నిధులు విడుదల చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని తెలిపారు. ఇప్పటికే నెట్వర్క్స్ హాస్పిటల్స్ కమిటీ సంబంధిత అధికారులకు, ఆరోగ్యశ్రీ సీఈవోకు సమాచారం అందించినట్టు పేర్కొన్నారు.