Army College | యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : దేశానికే దిక్సూచిగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నపళంగా విద్యాసంవత్సరం మధ్యలోనే కళాశాలను ఖాళీ చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆర్మీ కాలేజీ మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో బీబీనగర్ మండలం రాఘవపురంలో ప్రైవేట్ భవనంలో గురుకులాన్ని కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు ఆర్మీ సిబ్బంది నిత్యం శిక్షణ ఇస్తూ మెరికల్లా తయారు చేస్తుండేవారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశంలోనే ఎంతో పేరుపొందిన ఈ గురుకులాన్ని విద్యా సంవత్సరం మధ్యలోనే బంద్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భవన యజమాని ఖాళీ చేయమన్నాడనే కారణాన్ని చూపుతూ గురుకులాన్ని బంద్ చేశారు. రాత్రికి రాత్రే విద్యార్థినులతో సహా భవనాన్ని ఖాళీచేశారు. దీంతో విద్యార్థులు తమ సామగ్రిని సర్దుకొని ఇంటిబాట పట్టారు. గత కొంతకాలంగా భవన యజమానికి అద్దె చెల్లించడంలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే యజమాని కాలేజీ మేనేజ్మెంట్పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అక్కడ ఉన్న ఆర్మీ పోల్స్, ఇతర సామగ్రిని పూర్తిగా తొలగించేశారు. ఆర్మీ సిబ్బంది బహుమతి ఇచ్చిన యుద్ధ ట్యాంకులు తుప్పుబట్టి పోతున్నాయి. ఆర్మీ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. తాత్కాలికంగా ఘట్కేసర్లోని ఓ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం చెప్తున్నప్పటికీ, సరిగ్గా నడవడం లేదని తెలుస్తున్నది. విద్యా సంవత్సరం మధ్యలోనే ఖాళీ చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కాలేజీ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భవన యజమానితో చేసుకున్న అగ్రిమెంట్ పూర్తయింది. యజమాని ఒత్తిడి మేరకే కళాశాలను ఖాళీ చేశాం. ఘట్కేసర్ పరిధిలోని అవుశాపూర్లో ఉన్న ఒక కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నాం. త్వరలో బీబీనగర్ మండలంలోని అన్నంపట్లలో ఉన్న మరో కాలేజీకి షిఫ్ట్ చేస్తాం. ఆర్మీ సిబ్బందికి జీతాలు పెండింగ్ మాట వాస్తవమే. జనవరిలో జీతాలు చెల్లిస్తామని సెక్రటరీ తెలిపారు.
ఒక నాడు దేశంలోనే మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలగా కీర్తించబడిన డిగ్రీ కళాశాల రేవంత్రెడ్డి ప్రభుత్వంలో శిథిలమైపోయింది. తెలంగాణ బిడ్డలు ఉక్కులాంటి ఆఫీసర్లయిన మేజర్ ఉషాశర్మ, రాఖీహాన్ కనుసన్నల్లో శిక్షణ పొందారు. ఇప్పుడు ఇదే తెలంగాణ పేద బిడ్డలను రేవంత్రెడ్డి మళ్లీ చీకట్లోకి నెట్టేశా రు. గతంలో కేసీఆర్ పాలనలో ఈ కాలేజీ ఎంతో అద్భుతంగా నడిచింది. రిజర్వేషన్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులైన మిత్రులారా, మీ చేతకానితనాన్ని ఎలా వర్ణించాలో మాటలు రావడం లేదు. దీనికి మళ్లీ సీఎంవో నుంచి ఏమైనా స్క్రిప్ట్ రావాల్నా భయ్యాలు?? భవన యజమాని ఖాళీ చేయమన్నాడనే ఏకైక సాకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నఫళంగా పేదబిడ్డలను మరోచోటుకు రాత్రికి రాత్రే తరలించారు. అకడ పనిచేసే మిలిటరీ సిబ్బందికి 5 నెలల నుంచి జీతాలు లేవు. భారత సైన్యం బహుమతిగా ఇచ్చిన యుద్ధట్యాంకులు తుప్పు పడుతున్నాయి.