ఇచ్చోడ, ఏప్రిల్ 29 : ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఎస్బీ, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా .. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ నుంచి 14 మంది, కోకస్మన్నూర్ నుంచి ఒకరు, సిరికొండ మండలం పొన్న నుంచి ఒకరు నకిలీ నివాస ధ్రువీకరణపత్రాలతో ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఉద్యోగాలు పొందగా.. ఎంపికైనవారి సర్టిఫికెట్ల విచారణకోసం అధికారులు రాగా తమ గ్రామాల నుంచి ఎవరూ ఆర్మీకి ఎంపిక కాలేదని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఇస్లాంనగర్ నుంచి సూరజ్, బిపిన్, అతుల్‌కుమార్, రాజ్‌కుమార్, అంకిత్ , దీపక్‌కుమార్, జైనూల్, మిరాజ్ , అసద్‌ఖాన్, వినయ్‌వర్మ, నాగేంద్ర, అబిద్‌ఖాన్, శుభాందుబే, కుల్దీప్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి ధ్రువీకరణ కోసం పోలీసులు ఎంక్వైరీ చేయగా నకిలీవిగా నిర్ధారణ అయింది. మీసేవ సెంటర్ నుంచి ఈ వ్యవహారం నడిచినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లాంనగర్‌కు చెందిన సహాని సూరజ్, కోకస్‌మన్నూర్‌కు చెందిన గజేందర్, దిగ్విజయ్ విసుకర్మపై రెవెన్యూ, ఎస్బీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.