దుబ్బాక, మే17 : దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటే.. స్వగ్రామంలో తన భూమికి రక్షణ లేకుండా పోయిందని సోషల్ మీడియాలో ఓ జవాన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన జవాన్ బూరు రామస్వామి కశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. రామస్వామి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.
ప్రాణాలకు తెగించి కశ్మీర్లో విధులు నిర్వహిస్తుంటే, స్వగ్రామంలో తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని వీఆర్వో రమేశ్, అతడి సోదరుడు కలిసి రికార్డుల్లో లేకుండా చేసి, తన తల్లిదండ్రులు శామవ్వ, వెంకటయ్యను బెదిరిస్తున్నారని తెలిపాడు. వీడియోను చూసిన మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించి వెంటనే కలెక్టర్ మనుచౌదరితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అక్బర్పేట-భూంపల్లి తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి చౌదర్పల్లిలో సైనికుడి కుటుంబానికి చెందిన భూమిని పరిశీలించి వివరాలు సేకరించారు.