హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. గురువారం సెక్రటేరియట్ నుంచి టీజీపీఎస్సీ నుంచి చైర్మన్ మహేందర్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌తో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు నేరుగా పరీక్షలను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. 2011 తర్వాత ఈ పరీక్షలు జరుగుతున్నాయని, ఎలాంటి అపోహలు, పుకార్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని టీజీపీఎస్సీ నుంచి చైర్మన్ మహేందర్‌రెడ్డి నిర్దేశించారు. అన్ని సెంటర్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ జితేందర్ చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని టీజీపీఎస్సీ కార్యదర్శి నికోలస్ వివరించారు.