ఖలీల్‌వాడీ, జూలై 13: రేవంత్‌రెడ్డి ద మ్ముంటే తన మీద పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ ఆర్మూర్‌లో పోటీ చేస్తాడని ఆయన చెంచాగాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ము, ధైర్యముంటే కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి అర్వింద్ ఆర్మూర్‌లో పోటీచేయాలని చాలెంజ్ చేశారు. డిపాజిట్లు దక్కకుండా ఇద్దరిని ఓడగొట్టి ఇంటికి పంపిస్తానని అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై నిప్పులు చెరిగారు.
‘రేవంత్‌ది బేడీల చరిత్ర. అర్వింద్‌ది కేడీల చరిత్ర. క్యాడర్ లేని పార్టీకి క్యారెక్టర్ లేని లీడర్ రేవంత్. రెండు కండ్ల సిద్ధాంతంతో చంద్రబాబు ఖేల్ ఖతం. మూడు గంటల కరెంట్ సిద్ధాంతంతో రేవంత్‌రెడ్డి దుకాణం బంద్. రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు ఆత్మగా తెలంగాణ పాలిట ప్రేతాత్మగా పట్టిపీడిస్తున్నాడు’ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మూడు పంటల మొనగాడు అయితే, రేవంత్ మూడు గంటల కరెంట్ మోసగాడని విమర్శించారు.