చిక్కడపల్లి, సెప్టెంబర్ 10: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంతో మహత్తరమైనదని, మట్టి మనుషుల్ని మహావీరులుగా మార్చిన ఆ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి రచించిన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- ప్రచారాలు- వాస్తవాలు’ పుస్తకాన్ని శనివారం గోరటి వెంకన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకంలో ఒకనాటి పోరాటాన్ని క్లుప్తంగా, సమగ్రంగా సారంపల్లి మల్లారెడ్డి రాశారని అభినందించారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నిజాం సైన్యంతో పోరాటంలో 1,500 మంది అమరులయ్యారని, యూనియన్ మిలిటరీతో సాగిన పోరాటంలో 2,500 మంది మృతి చెందారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రసాద్, రైతు సంఘం నాయకుడు శోభన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.