పెద్దపల్లి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో భారీ బహిరంగా సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, పెద్దకల్వలలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంతో పాటుగా పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
దాదాపు 50 ఎకరాల స్థలంలో నిర్వహించే ఈ మైదానంతో పాటుగా పార్కింగ్, వీఐపీ రోడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా పెద్దపల్లి, రామగుండం, మంథని నియోకవర్గాల నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
లక్ష మందితో నిర్వహించే ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం ఎవరికి కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆయన వెంట పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీసీపీలు రూపేష్, అఖిల్ మహాజన్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, జిల్లా అధికారులు మునిరాజ్, నరసింహాచారి,పెద్దపల్లి తహసీల్దార్ సుధాకర్ ఉన్నారు.