కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు కింద సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. దళితబంధు పథకంపై శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో ముందుగా మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకాన్ని ఈ నెల 16న హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని, 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ స్కీం వర్తించేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు ఎవరినీ ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామ సభ ద్వారా ఫైనల్ చేస్తామని, ఆ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తామని చెప్పారు. జాబితాలో ఎమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చని, అర్హత ఉండి ఎవరి పేరైనా రాకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దళిత బంధు అమలుకు హుజూరాబాద్‌ను పైలెట్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక ఉన్నత లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద ఎంపిక చేసిన ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున సహాయం అందిస్తామని, నేరుగా లబ్ధిదారుడి అకౌంట్లోకి వస్తాయని చెప్పారు. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న వ్యాపారం, లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
అలాగే సదరు రంగంలో వారికి సంపూర్ణ పరిణితి వచ్చే వరకు అవసరమైన నైపుణ్యతను అందిస్తామన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సూచనలు సలహాలు అందిస్తారన్నారు. పథకం పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ అమలు తీరులో వచ్చిన ఇబ్బందులు, లబ్ధిదారులు వ్యాపార కార్యకలాపాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామన్నారు. అప్పుడే ఈ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణత వస్తుందని, తద్వారా ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి ఈజీ అవుతుందన్నారు. ఈ పథకం సాచురేషన్ మోడ్‌లో అమలు చేసే ప్రాసెస్‌లో ఉన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక అనేది ముందుగా ఆర్థికంగా పూర్తిగా వీక్‌గా ఉన్న కుటుంబాల నుంచి ప్రారంభమై పైకి వస్తుందన్నారు.
కలెక్టర్ మంజూరు చేస్తారు : రాహుల్ బొజ్జా
హుజూరాబాద్ నియోజకవర్గంలోని 106 గ్రామాల్లో దళితులున్నట్లు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా గుర్తించామని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. ఆ గణాంకాల ఆధారంగా అధికారుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేసినట్లు తెలిపారు. సర్వేలో ఎవరైనా మిస్ అయి ఉంటే వారి వివరాలు కూడా తీసుకున్నామన్నారు. ఎంపిక పక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, కో ఆర్డినేటర్ల సమక్షంలో ఎంపిక పూర్తి చేసి.. వాటిని గ్రామ పంచాయతీతో పరిధిలో అతికిస్తామన్నారు. అన్ని ఒకే అయ్యాక కలెక్టర్ సదరు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తారని తెలిపారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. వారు ఎటువంటి వ్యాపారం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారో.. సదరు కుటుంబంతో కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని చెప్పారు.
ఒకే గ్రామంలో లబ్ధిదారులు ఒకే రకమైన వ్యాపారం పెడితే.. తద్వారా తలెత్తే ఇబ్బందులను కూడా పరిణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంచుకున్న వ్యాపారాన్ని సజావుగా నడుపుకునేందుకు కావాల్సిన నైపుణ్యం కల్పిస్తామన్నారు. అలాగే వ్యాపారం ముందుకెళ్లడానికి కావాల్సిన చేయూతనిస్తూనే ఒకటీరెండేళ్ల పాటు పూర్తి పర్యవేక్షణ చేస్తామన్నారు. ఆర్థికంగా సదరు కుటుంబాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఏదేని అనివార్య కారణాల వల్ల లబ్ధిదారులకు ఏమైనా జరిగితే.. వారికి అండగా నిలిచేందుకు దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిని లబ్ధిదారులే నిర్వహిస్తారన్నారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.