హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రినాయుడు సుప్రీంకోర్టుకు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావును లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారని చెప్పారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూ డిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం ప్రభాకర్‌రావు మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, ప్రభాకర్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు కొనసాగించారు.
సుప్రీంకోర్టు ప్రభాకర్‌రావుకు కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని, కోర్టు ఇచ్చిన రక్షణను ఆయన దుర్వినియోగం చేస్తున్నారని తుషార్ మెహతా, సి ద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపించారు. ఆయన విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని తదితర అంశాలతో ప్రభాకర్‌రావుకు కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు సాక్ష్యాలను ధ్వంసం చేశారనే దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని దామా శేషాద్రినాయుడు తెలిపారు. విచారణకు ప్రభాకర్‌రావు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం ఈ కేసును అక్టోబర్ 8కి వాయిదా వేసింది.