హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ ఎమ్మెల్యే ఏ మహేశ్వర్రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. గ్రామసభల ఆమోదం లేకుండా ఈ కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుకల్పిస్తూ ఈ నెల 11న ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి జారీచేసిన జీవో 33 రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018లోని నిబంధనలతోపాటు 73వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా ఉన్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొంటూ.. ఆ జీవోను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. గ్రామసభలు, వార్డు కమిటీల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టడం అక్రమమని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నియమిస్తారని, దీంతో ఆ కమిటీలు అధికారపార్టీకి చెందినవారిని లబ్ధిదారులుగా ఎంపికచేసి, నిజమైన నిరుపేదలకు తీరని అన్యాయం చేసే అవకాశం ఉన్నదని వివరించారు. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులకు చోటు కల్పించకుండా గతంలో ఇదే తరహాలో జారీ చేసిన 10, 12 జీవోలను హైకోర్టు డిస్మిస్ చేసిందని గుర్తుచేస్తూ.. ప్రజాహిత కార్యక్రమాలకు విధిగా గ్రామసభల అనుమతి తీసుకోవాలని తెలిపారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు విచారణను వాయిదా వేసింది.