కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 26 : జనవరి నుంచి తమకు బిల్లులు రాలేదని, తమ సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్‌కు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్య అంటే ముందుకు వస్తున్న ప్రభుత్వం తమను మాత్రం పట్టించుకోవడం లేదంటూ డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో మెనూ ప్రకారం వడ్డించడం లేదని, నాసిరకం బియ్యంతో వండుతున్నారని, ముద్దగా మారిన అన్నం తమకు వద్దంటూ సోమవారం విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులతో డీఈవో జనార్దన్‌రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన మెనూ ప్రకారం ఆహారం తయారుచేసి విద్యార్థులకు అందించాలని, వారి కడుపు మాడ్చే పని చేయరాదని సూచించారు. స్పందించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకుల నుంచే ఆహారం వండుతున్నామని చెప్పారు.
విద్యార్థులకు ఎదుగుదలలో భాగంగా గత ప్రభుత్వం రాగి జావ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అందించే జావ ప్యాకెట్లలో తెల్ల పురుగులు ఉండటంతో విద్యార్థులు దాన్ని తాగడానికి నిరాకరించారు. దీంతో ఆ జావను డీఈవో కండ్ల ముందే మధ్యాహ్న భోజన నిర్వాహకులు పారబోశారు.