పెంట్లవెల్లి, మార్చి 26: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్, కొండూరు, శింగవరం, గోప్లాపురం గ్రామాల సమీపంలో ఉన్న వాగుల నుంచి కాంగ్రెస్ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట నెల రోజులుగా అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు. 8 నుంచి 10 ట్రిప్పులకు అనుమతి తీసుకొని.. 50 నుంచి 60 ట్రిప్పుల వరకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో వందల ట్రాక్టర్ల ఇసుక డంప్ చేసుకుంటున్నారని కొండూరుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు మంగళవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించినా, అభివృద్ధి పనుల పేరిట విక్రయించినా, డంప్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హిమబిందు హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు అధికారి ఎదుటే రైతులు, బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. తహసీల్దార్, అధికారులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.