హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): వడగాల్పులు జాతీయ విపత్తు కాదా? అని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ ప్రశ్నించారు. బెంగళూరు వేదికగా ఐఐఎం నిర్వహించిన ‘ైక్లెమెట్ ఇన్నొవేషన్ సమ్మిట్-2026’లో ప్యానెల్ స్పీకర్‌గా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయని చెప్పారు. వరదలు, భూకంపాల కంటే వడగాల్పులతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. అయినా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధుల పరిధిలో వడగాల్పులను విపత్తుగా గుర్తించకపోవడం ప్రభుత్వ విధాన వైఫల్యమే అని పేర్కొన్నారు.
రాబోయే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునేలా అన్ని రాష్ర్టాలు ఒత్తిడి తేవాలని సూచించారు. ఢిల్లీలో రూపొందించిన ప్రభుత్వ విధానాలకు, క్షేత్రస్థాయిలో అమలుకు మధ్యనున్న భారీ గ్యాప్ కారణంగా పర్యావరణ లక్ష్యాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 4.4కోట్ల మంది భాగస్వామ్యంతో 19.6 కోట్ల మొక్కలు నాటినట్టు ఆయన వివరించారు. ఈ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ పోరాటం.. ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కార్బన్ మార్కెట్లలో సామాన్యులకు చోటు
దేశంలో కొత్తగా తీసుకొస్తున్న కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్(సీసీటీఎస్) కేవలం బడా కార్పొరేట్ సంస్థలకే పరిమితం కాకూడదని సంతోష్‌కుమార్ సూచించారు. పర్యావరణాన్ని కాపాడే స్థానిక పంచాయతీలు, కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టులకు కూడా కార్బన్ మార్కెట్లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్‌చేశారు. అలాగే దేశంలోని ప్రతి కాలేజీ క్యాంపస్‌ను ఒక ‘ైక్లెమెట్ గవర్నెన్స్ యూనిట్’గా మార్చాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తొలిసారి ఒక ైక్లెమెట్ సదస్సును ‘కార్బన్-నెగెటివ్’ ఈవెంట్‌గా మార్చిన ఘనతను గ్రీన్ ఇండియా చాలెంజ్ దక్కించుకున్నదని తెలిపారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరి పేరుతో ‘పునర్వసు ప్రాజెక్ట్’ కింద జియో ట్యాగ్ చేసిన వెదురు మొక్కలను నాటారు. సాధారణ చెట్ల కంటే వెదురు నాలుగు రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని 35 శాతం ఎక్కువ ఆక్సిజన్‌ను ఇస్తాయని చెప్పారు.
ఈ మొక్కల పెంపకం బాధ్యతను 1000 రోజులపాటు తమ సంస్థ తీసుకుంటుందని సంతోష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్(ఐఎంవో) గురించి ప్రతినిధులకు సంతోష్ వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐఎంవో లాభాపేక్ష లేని సంస్థగా పని చేస్తున్నట్టు వివరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో.. మాజీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ 33 దేశాల్లో 22 వేలకు పైగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటుచేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లో హెచ్ఐసీసీ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక ‘హైదరాబా ద్ ైక్లెమెట్ యాక్షన్ వీక్ (హెచ్సీఏడబ్ల్యూ)’కు రావాల్సిందిగా సదస్సు భాగస్వామ్యులందరికీ సంతోష్ ఆహ్వానం పలికారు.
జీఐసీపై జర్మన్ రేడియో ప్రశంసల జల్లు.. సుందర్బన్స్ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన మడ అడవుల్లోని సుందర్బన్స్ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటున్నది. జర్మనీకి చెందిన జాతీయ సాంస్కృతిక రేడియో ‘డ్యూచ్ లాండ్ ఫంక్ కల్తుర్’ ఈ హరిత ఉద్యమాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రకృతిపై మనుషుల ప్రేమ, దృఢసంకల్పం, సామాజిక స్ఫూర్తి కలగలిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో సుందర్బన్స్ మడ అడవుల (మాంగ్రోవ్స్) పెంపకం నిరూపించింది.
ఈ అద్భుత ఘట్టంపై జర్మన్ రేడియో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. సుందర్బన్స్లో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు స్థానిక సామాజిక సాధికారతను జోడించి గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపొందించిన నమూనా ఆదర్శనీయంగా నిలిచిందని జర్మన్ రేడియో కొనియాడింది. వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న సుందర్బన్స్ లాంటి సున్నితమైన ప్రాంతంలో ఈ స్థాయి పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం విప్లవాత్మకమైన మార్పు అని పేరొంది.
రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ దూరదృష్టి, పర్యావరణ దార్శనికతతో రూపుదిద్దుకున్న జీఐసీ ఇప్పుడు కేవలం ఒక కార్యక్రమంగా మిగులకుండా ప్రజా ఉద్యమంగా మారింది. సంతోష్‌కుమార్ పిలుపుతో, ఆయన నాయకత్వంలో మొక్కలు నాటడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం లక్షలాది మంది ప్రజలు చేతులు కలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ ఉద్యమం, ఇప్పుడు సుందర్బన్స్ అడవుల రక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నది.