Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక టాక్సీ వాహనంపై కొండ చరియలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం, ఉదయ్‌పూర్-కిల్లార్ రోడ్డు మార్గంలో, కాడు నల్లాహ్ సమీపంలో జరిగింది. 15 మందితో ఒక టాటా సుమో ఈ మార్గంలో, పర్వతం దిగువ నుంచి వెళ్తుండగా ఉన్నట్లుండి పైనుంచి కొండచరియలు విరిగిపడ్డాయి.
అందులో భారీ బండరాళ్లు వాహనంపై పడటంతో టాటా సుమో నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు ముందు.. గురువారం రోజే ఈ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు వాహనాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
వాహనదారులు టిండి గ్రామంలో ఉండాలని అధికారులు సూచించారు. అనంతరం శుక్రవారం ఉదయం రోడ్డుపై రాళ్లను తొలగించిన అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఆ తర్వాత కాస్పేపటికే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 130కిపైగా రోడ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. సిమ్లా, చంబాతోపాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో రవాణాకు ఆటంకం ఏర్పడుతోంది.