Jeevan Reddy | తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని కోల్పోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే తనకు తమ్ముడిలాంటి వాడిని కోల్పోయాననే ఆవేదనలో ఉన్నారని ఆయన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఆ బాధతోనే ‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి’ అంటూ కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
అడ్లూరి లక్ష్మణ్‌తో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. గంగారెడ్డి మరణం నేపథ్యంలో జీవన్ రెడ్డిని పరామర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డి అసహనంగా ఉండటంతో ఆయన్ను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి వినిపించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాలని మహేశ్‌కుమార్‌ను ఎదురు ప్రశ్నించారు. చంపించుకోవడానికే పార్టీలో ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా ఫోన్‌ను పక్కన పడేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. తన ప్రధాన అనుచరుడి హత్య గురించి తెలియగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుల్నే ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీయాశీలకంగా పార్టీలో పనిచేస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. గంగారెడ్డిని చంపిన వారిని పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
‘ మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం.. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం.. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు.’అని అడ్లూరి లక్ష్మణ్‌ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు.