హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌లో నూతనంగా ప్రారంభించిన జేఎన్టీయూ కళాశాలల్లో ఈ ఏడాది అయినా సీట్లు నిండుతాయా? విద్యార్థులు చేరతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఈ రెండు కాలేజీల్లో 50 లోపు మంది విద్యార్థులు మాత్రమే చేరిన నేపథ్యంలో సీట్ల భర్తీపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ విద్యాసంవత్సరంలో పాలేరుకు, మానుకోటకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరు చేశారు. సాంకేతిక విద్యను అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో గత కేసీఆర్ సర్కారు ఈ రెండు కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ కాలేజీల్లో సీఎస్ఈ (డాటాసైన్స్), సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులను వీటిల్లో ప్రవేశపెట్టారు.
ఆఖరు నిమిషంలో ఈ రెండు కాలేజీలను ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చారు. దీంతో 50లోపు మంది విద్యార్థులు మాత్రమే ఈ కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. ఆచార్యుల కొరత సమస్యను అధిగమించేందుకు ఇటీవలే జేఎన్టీయూ ఈ రెండు కాలేజీలకు ఆరుగురు చొప్పున కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని నియమించింది.
ల్యాబ్‌లను, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నది. ల్యాబ్‌ల ఏర్పాటుకు ఒక్కో కాలేజీకి 30 చొప్పున కంప్యూటర్లను సమకూర్చారు. ఈ ఏడాది ముందుగానే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఈ రెండు కాలేజీలు చేర్చనున్న నేపథ్యంలో ఈ ఏడాది సీట్లు నిండుతాయని జేఎన్టీయూ అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.