Grama Panchayati Elections | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో 242 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయా? కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి, పాతవాటితోపాటే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ‘ప్రభుత్వం తలచుకుంటే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టవచ్చు. ఆమోదింపజేయవచ్చు కూడా. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం తెలిపితే, కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఎంత పని?’ అని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటైనప్పుడు రాష్ట్రంలో మొత్తం 8,685 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలు, కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా 2019 ఎన్నికల నాటికి గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తండాలను పంచాయతీలుగా చేయడంతో కొత్తగా మరో 223 జీపీలు పెరిగాయి. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 12,848 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
వెల్లువెత్తిన వినతులు
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక జిల్లాల్లో కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కనీసం 350 మంది జనాభా ఉండాలనే నిబంధనను మార్చయినా, తాము ప్రతిపాదించే అన్ని గ్రామపంచాయతీలకు ఆమోదం తెలిపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. గ్రామ జనాభా, దూరంతో పాటు ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.