హైదరాబాద్ జూన్1 (నమస్తే తెలంగాణ): జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రవూఫ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వైద్యులు బాధ్యులా? అని ప్రశ్నించారు. శస్త్రచికిత్స సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచి పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ఫోన్ల ఫ్లాష్లైట్లు, టార్చ్లైట్ల సాయంతో సేవలు కొనసాగించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైద్యులను బాధ్యులను చేసి వేటు వేయడం బాధాకరమని పేర్కొన్నా రు.
మౌలిక వసతుల కల్పనలో విఫలమైన ఆరోగ్యశాఖ డాక్డర్లపై ఆగమేఘాలపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండానే డాక్టర్ల నిర్లక్ష్యమని నిర్ధారించడం అన్యాయమని తెలిపారు. జనరేటర్లు, అత్యవసర పరిస్థితుల్లో కరెంట్ సౌకర్యం కల్పించాల్సిన ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని స్పష్టంచేశారు.
నిష్పాక్షిక విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. వాస్తవాలను పక్కనబెట్టి వైద్యులను బాధ్యులను చేయడం టీవీవీపీ కమిషనర్ ఒంటెద్దు పోకడలకు నిదర్శమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులపై ఆడిట్ చేయాలని, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయాలని వారు డిమాండ్ చేశారు.