హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పదో శతాబ్దం నాటి జైన శిల్పాలను పురావస్తు శాస్త్రవేత్తలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు గుర్తించారు. అక్కడ రాష్ట్రకూటుల కాలం నాటి జైన తీర్థంకర శిలా ఫలకాలు, శిల్పాలు ఉన్నట్టు వెల్లడించారు. యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో జైన శిల్పాలున్న ప్రాంతాన్ని ఆదివారం ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సందర్శించారు.
అక్కడ ఆదినాథ, నేమినాథ, పార్శనాథ, వర్ధమాన మహావీర శిల్పాలు ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నట్టు ఆయన తెలిపారు. రెండు శిలాఫలకాలపై 9-10 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ శాసనాలు ఉన్నాయని వివరించారు. దాదాపు 100 ఏండ్ల కిందట నిర్మించిన ఈ తూముకు స్థానిక శిథిల జైనాలయం నుంచి తెచ్చి వీటిని బిగించి ఉంటారని, రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సమీపంలోని చిలుకూరు జైన కేంద్రమని, ఎనికేపల్లి జైన బసది కూడా నాటిదేనని చెప్పారు. ఈ శిల్పాలను కాపాడాలని ఆయన స్థానికులను కోరారు.