Polasa | జగిత్యాల, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన పొలాసను ఒకప్పుడు మేడరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పొలాసలోని ప్రధాన ఆలయమైన పౌలస్తీశ్వరాలయంలో ఉన్న ఐదు వీరగల్లు శిలలపై జరిపిన పరిశోధనలో మూడు వీరగల్లు శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకటి తెలుగు భాషలో ఉండగా, మరొకటి నాగరి లిపిలో ఉండటం విశేషం. మరో శాసనం వివరాలు తెలియాల్సి ఉన్నది. పొలాస పౌలస్తీశ్వర ఆలయంలో క్రీ.శ. 1107లో మేడరాజు రాజ్యాధికారం చేస్తున్న సమయంలో వీరబలిజ కులస్థులకు చెందిన శాసనం ఉన్నది. గ్రామానికి తూర్పు వైపు బొడ్రాయి, భారీ గణపతి విగ్రహం వద్ద మూడు అక్షరాలతో రెండు పంక్తుల్లో ఉన్న శాసనాన్ని రికార్డు చేశారు. పంచాయతీ కార్యాలయ సమీపంలో ఒక శాసనాన్ని గుర్తించారు.
రెండేండ్ల క్రితం పబ్లిక్ రిసెర్చ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ (ప్రీహా) సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసన్, ‘నమస్తే తెలంగాణ’ బృందంతో పొలాసలో పరిశోధన జరిపి ఒక వీరగల్లు శిల్పంతోపాటు, 12వ శతాబ్దానికి చెందిన మహిళా భక్తురాలి విగ్రహాన్ని వెలుగులోకి తెచ్చారు. వీరగల్లు శిల్పంలోని ప్రధాన వీరుడు మాత్రం బారు జడతో ఉండటం విశేషం. వీరుడి నెత్తిపై రెండు అంతస్తుల్లో ఛత్రం, ఆపైన సూర్య, చంద్రులు, లింగం చెక్కి ఉన్నాయి. గుర్రంపై ఉన్న వీరుడు మరో గుర్రంపై ఉన్న యుద్ధవీరుడి తలను వంచి రెండుగా ఖండిస్తున్నట్టుగా శిల్పం చెక్కబడి ఉన్నది. అలాగే వీరుడి గుర్రం దిగువన మరో వీరుడు, గుర్రం పడిపోయినట్టు, వీరుడి గుర్రం ముందు కాళ్లు మరో గుర్రాన్ని, యుద్ధవీరుడిని తొక్కివేస్తున్నట్టు అందంగా చెక్కారు.