హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఒక్కొక్కరికీ ఒక్కో నిబంధన. నచ్చినోళ్లకు రిటెన్షన్లు. కోరుకున్న చోట పోస్టింగ్‌లు. నచ్చనోళ్లకు కండీషన్లు. ఆప్షన్లను కూడా పక్కకు నెట్టి దూరప్రాంతాలకు బదిలీలు. ఇదీ ఇరిగేషన్‌శాఖలో పరిస్థితి. అంతా ఉన్నతాధికారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇదేమని నిలదీసినందుకు డిప్యుటేషన్లు కల్పిస్తామంటూ దాటవేస్తుండడం కొసమెరుపు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024లో జూలైలో బదిలీలను చేపట్టేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే వానకాలం నేపథ్యంలో ఆ బదిలీల నుంచి ఇరిగేషన్‌శాఖను ప్రభుత్వం మినహాయించింది. దీంతో సాగు నీటిపారుదల శాఖలో బదిలీలు నిలిచిపోయాయి. అప్పటికే సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నవారు అక్కడే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల బదిలీలకు మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించి, ఒకే స్టేషన్లో 4ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఈక్రమంలో సీఈలు, ఎస్ఈలు కలిపి 32మంది, ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు) 60మంది, డీఈఈలు 350 మంది, ఏఈఈ 650 మంది వరకు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లోనూ ఉన్నతాధికారులు భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
ఆప్షన్లను పక్కకు నెట్టి..
ట్రాన్స్ఫర్లకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో జోన్ ప్రాతిపదికన ఒక్కో ఇంజినీర్ 5ప్రాంతాలకు ఆప్షన్లు ఇచ్చారు. నిబంధనల ప్రకారం అధికారి ఎంపిక చేసుకున్న ఆప్షన్లలో ఏదో ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఆ స్థానాల్లో ఖాళీ లేకుంటే సదరు ఉద్యోగికి మరోసారి ఆప్షన్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఆప్షన్లు కాదని అనేక మంది ఇంజినీర్లను ఇష్టానుసారం పోస్టింగ్‌లు ఇచ్చారు. ఒకవేళ ఆప్షన్లు కాదని పోస్టింగ్‌లు ఇచ్చినా.. చాలా వరకు సదరు ఉద్యోగి కోరుకున్న ప్రాంతానికి సమీపంలోని మరో ప్రాంతంలోనైనా పోస్టింగ్ ఇస్తారు. కానీ ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం అది కూడా పాటించలేదు. కోరుకున్న ఆప్షన్లలో పోస్టింగ్ ఇవ్వకపోగా, ఇష్టారీతిన పదుల సంఖ్యలో ఇంజినీర్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం గమనార్హం.
ఇష్టారీతిన రిటెన్షన్లు..
ప్రస్తుత బదిలీల సందర్భంగా కీలకమైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న స్థలంలో, అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగాల్లో తగినంత మంది సిబ్బంది, అనుభవజ్ఞులైన ఇంజినీర్లు ఉండాల్సిన అవసరముంది. అయితే ఆయా కార్యాలయాల ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను, వర్ లోడ్, కార్యాలయంలో అనుభవమున్న ఉద్యోగుల అవసరాన్ని వివరిస్తూ, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పేరిట బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని రిటెన్షన్ కోరుతారు. ప్రభుత్వం పరిశీలించి వారికి బదిలీల నుంచి మినహాయింపునిస్తుంది. దానిని సాకుగా చూపి ఒకే స్టేషన్లో దశాబ్దకాలం కంటే ఎక్కువగా కొనసాగుతున్న ఇంజినీర్లు సైతం రిటెన్షన్లు రాయించుకునే దందాకు తెరతీసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఇరిగేషన్‌శాఖకు చెందిన ఓ విభాగంలో ఉద్యోగంలో చేరిన నాటినుంచి ఇప్పటికీ 18ఏండ్లుగా ఓ ఇంజినీర్ తిష్టవేశారు. తాజా బదిలీల్లో కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంది. కానీ సదరు ఇంజినీరును అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ మీద బదిలీల నుంచి మినహాయిస్తూ రిటెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్డనైజేషన్ (సీడీవో) విభాగం, ఓఅండ్ఎం, డ్యామ్‌సేఫ్టీ, అడ్మిన్ విభాగంతోపాటు, సీఈ పరిధిలోని కార్యాలయంతోపాటు, ఇతర విభాగాల్లోనూ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అనేకమందికి ఇదే తీరులో రిటెన్షన్లు కల్పించారు.
ఇంజినీర్ల ఆగ్రహం
శాఖలో చేపట్టిన బదిలీల తీరుపై ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల మంది ఇంజినీర్లు ఎర్రమంజిల్ జలసౌధ కార్యాలయానికి తరలివచ్చి ఈఎన్సీ అడ్మిన్‌ను ఘెరావ్ చేశారు. ఆన్లైన్లో పెట్టిన ఆప్షన్ ఇవ్వకుండా ఇతర ప్రాంతాల్లో పోస్టింగులు ఎలా ఇచ్చారని నిలదీశారు. పైరవీలు చేసుకున్నోళ్లకే ఇష్టారీతిన పోస్టింగ్‌లను ఇచ్చారని మండిపడుతున్నారు. ఇతర లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులకు కూడా రిటెన్షన్లు ఇవ్వడం వల్ల ఫీల్డ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన ఇంజినీర్లు సీడీవో, ఈఎన్సీ అడ్మిన్, ఇతర విభాగాల్లో పనిచేసే అవకాశాన్ని, అనుభవాన్ని పొందే అవకాశాలను కోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనిపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. బదిలీల్లో జరిగిన తప్పులను సరిదిద్దకపోతే కార్యాలయాన్ని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.