AR SI Suicide | ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రసాలో నివాసం ఉంటున్న ఏఆర్ ఎస్ సుర్ణపాక లక్ష్మీనర్సు (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో గురువారం కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని 15వ బెటాలియన్‌కు చెందిన లక్ష్మీనర్సు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ ఎస్ఐగా పని చేస్తున్నారు. కుటుంబంతో ములుగు జిల్లా గోవిందరావుపేట పస్రాలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం మాణిక్యారం. ఆయన నివాసంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పస్రా ఎస్ఐ కమలాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా.. మృతుడి భార్య సునీత గోవిందరావుపేట మండలంలోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య బుధవారం గొడవ జరిగిందని.. దాంతో భార్యను ఇంటి నుంచి ఎస్ఐ గెంటి వేశారని.. దాంతో ఆమె హన్మకొండలోని బంధువుల ఇంటికి పిల్లలతో కలిసి వెళ్లినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.