
హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే వారిపై కఠినచర్యలు తీసుకొనేలా చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును సోమవారం అసెంబ్లీలో మంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పర్యాటకులు, ప్రయాణికులను మోసంచేయడం, దురుసుగా ప్రవర్తించడం, దళారీతనానికి ప్రయత్నించడం వంటి చర్యలను నిరోధించడమే దీని లక్ష్యం.
ఈ బిల్లు ప్రకారం.. పర్యాటకులను మోసంచేసిన వారికి 10 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మోసాన్ని ప్రేరేపించిన వారికి ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా వేస్తారు. మోసగించేందుకు ప్రయత్నించిన వారికి 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు మంత్రి మహమూద్ అలీ తెలిపారు. దీనితోపాటు సీఎం కేసీఆర్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రవేశపెట్టిన తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ తరపున ఇండియన్ స్టాంప్స్ అమెండ్మెంట్ బిల్లు-2021ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
నేడు అసెంబ్లీలో దళితబంధుపై చర్చ
అసెంబ్లీలో మంగళవారం దళితబంధు పథకంపై చర్చ జరుగనున్నది. ఈ పథకంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దళిత ప్రజాప్రతినిధులు, దళిత సంఘాలు, మేధావులతో చర్చించారు. ఈ పథకం రూపకల్పన, అమలు, దళితుల అభివృద్ధి తదితర అంశాలపై అసెంబ్లీలో మరింత విస్తృతంగా చర్చించనున్నారు.