హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ): నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల రైతుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. కొన్నిరోజులుగా రైతులతో కలిసి నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు మంజీర డ్యామ్ నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. సోమవారం రాత్రే డ్యామ్ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతామని ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్- సీవరేజీ బోర్డు జనరల్ మేనేజర్ ఏ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నీటిపారుదల శాఖ ఎస్ఈ (ఐఅండ్‌క్యాడ్ సర్కిల్) విజ్ఞప్తి మేరకు మంజీరా బరాజ్ నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం రాత్రి డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని ఆయకట్టు కాలువలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. సమీపంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. నీటి విడుదలతో ఘన్పూర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగానికి ఊరట లభించనున్నది.
ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఒత్తిడికి తలొగ్గిన సర్కార్
సింగూరు (మంజీరా) డ్యామ్ నుంచి సాగునీటిని విడుదల చేసి చివరి దశలో ఉన్న ఘన్పూర్ ఆయకట్టు పరిధిలో 60 వేల ఎకరాల్లోని పంటలను కాపాడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి గత కొన్నిరోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వానికి తెలిపారు. పలుమార్లు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు, రైతులతో కలిసి ఆందోళనలకు దిగారు. ఆదివారమే సీఎం రేవంత్‌రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖలు కూడా రాశారు.
సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చిత స్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను ఏకరువు పెట్టారు. ‘ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి.. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి మిగిలిన పంటలను కాపాడాలి’ అని విజ్ఞప్తిచేశారు. సింగూర్ నుంచి నీరు విడుదల చేసినట్టు సమాచారం ఉన్నప్పటికీ మంజీరా డ్యామ్ అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు లేక క్షేత్రస్థాయిలో పంటలకు నీరందలేదని ప్రస్తావించారు. ఘన్పూర్ ఆయకట్టుకు అవసరం మేర నీరు విడుదల చేయకుంటే దీని పరిధిలోని 10 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఏడు చెక్‌డ్యామ్‌లకు నీరు చేరదని ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ దశల్లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చొరవతో ప్రభుత్వం దిగొచ్చింది. నీటి విడుదలకు ముందుకొచ్చింది. ఈ మేరకు నీటి విడుదలపై ఆమె హర్షం వ్యక్తంచేశారు.