Congress | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ రగడ కొనసాగుతున్నది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడంతో ఆ స్థానం కోసం ఆశలు పెట్టుకున్న సీనియర్లు ఆకస్మికంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరు తెరపైకి రావడంతో కంగుతిన్నారు.
దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని, పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని ఇతర రాష్ర్టాల నేతలకు అవకాశం ఇవ్వడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జైరాం రమేశ్‌కు ఉమ్మడి రాష్ట్ర నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించినట్టే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానం భుజాల మీద తుపాకీ పెట్టి రాష్ట్రంలోని సీనియర్ల ఆశలపై కాల్పులు జరిపారని ఆశావహులు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్ఠానంతో నేరుగా సంబంధాలున్న పార్టీ సీనియర్ నేతలెవరినీ ఆ ఛాయలకు కూడా పోనివ్వని రీతిలో వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తెరవెనుక క్రియాశీలకంగా పనిచేసిన పార్టీ సీనియర్ నేతలు, ఇతర ముఖ్యులకు వారి వారి స్థాయిని బట్టి పెద్దల సభకు పంపుతామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు.
మాజీ ఎంపీలు రామసహాయం సురేందర్‌రెడ్డి, వీ హన్మంతరావు, మాజీ మంత్రులు కోదండరెడ్డి, జానారెడ్డి సహా పలువురు పార్టీ నేతలు రాజ్యసభ స్థానం ఆశిస్తున్నారు. ఇప్పటికే రామసహాయం సురేందర్‌రెడ్డి కొడుకు ఖమ్మం ఎంపీగా ఎన్నికకాగా, జానారెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేకే ఖాళీ చేసిన స్థానానికి తమ పేరును పరిశీలించాలని వీ హన్మంతరావు, కోదండరెడ్డి సహా పలువురు నేతలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. అభిషేక్ మను సింఘ్వీని రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిస్తామని స్వయంగా రేవంత్‌రెడ్డే అధిష్ఠానానికి హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.
అభిషేక్ మను సింఘ్వీ పేరు రాష్ట్రం నుంచి రాజ్యసభకు తెరపైకి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. దేశంలో ప్రముఖ న్యాయవాదిగా అభిషేక్‌కు పేరున్నది. దేశంలో అతి చిన్న వయసులోనే భారత అదనపు సోలిసిటర్ జనరల్‌గా పనిచేసిన రికార్డు ఉన్నది. ఇటువంటి న్యాయకోవిదుడిని రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడానికి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటే తమకేం అభ్యంతరం లేదని, అదే సమయంలో తమకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరే హక్కు తమకు ఉన్నదని పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ఈ పేరును సూచించడంలో ‘ఓటుకు నోటు కేసు’ వ్యవహారం దాగున్నదనే ప్రచారం గాంధీభవన్ సహా పార్టీ సీనియర్ నేతల్లో జోరుగా సాగుతున్నది.
ఎన్నికల సమయంలో కోదండరాంరెడ్డి, అందెశ్రీలకు రాజ్యసభ ఎంపీలుగా అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం. ‘ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మీ ఇద్దరినీ నా రెండు కండ్లుగా భావిస్తా. దేశంలో మేధావులు, వివిధ రంగాల విషయ నిపుణులు ఉండే స్థానంలో మిమ్మల్ని నిలబెట్టే పూచీ నాదీ’ అని వారికి పరోక్షంగా రాజ్యసభ ఆఫర్ చేశారని ఉద్యమకారులు చెప్తున్నారు. సీఎం తన వైపు నుంచి ఎమ్మెల్సీ పదవికి క్లియర్ చేసినా, గవర్నర్ దగ్గర ఫైల్ ఉన్న నేపథ్యంలో కోదండరాంకు ఏమనాలో పాలుపోని పరిస్థితి నెలకొన్నది.
కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాళ కాకపోయినా, రేప పక్కా అనే వాతావరణం నెలకొనడంతో తరువాత స్థానం అందెశ్రీది అని ఉద్యమకారులు భావించారు. ఎన్టీఆర్ హయాంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సీ నారాయణరెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసినట్టే, అందెశ్రీకి కూడా ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని ఆశించారు. అయితే, ఆకస్మికంగా అభిషేక్ మను సింఘ్వీ పేరు తెరపైకి రావడం, ఆ పేరును సూచించిందే సీఎం రేవంత్‌రెడ్డి అని ప్రచారం కొనసాగడంతో అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఇటు ఉద్యమకారులు ఒక్కసారిగా విస్మయానికి గురవుతున్నారు.