హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1లో విజయం సాధించని కొందరు , కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మెద్దని కమిషన్ ప్రకటనలో కోరింది. రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయకున్నా మార్కులు తగ్గాయని కొందరు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, రాజ్యాంగబద్ధ సంస్థగా, నిబంధనలకు లోబడి నియామక ప్రక్రియను చేపడుతున్నట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మెయిన్స్ జవాబుపత్రాలను వర్సిటీల్లోని సమర్థులైన, రెగ్యులర్ ఫ్యాకల్టీచే మూల్యాంకనం చేయించినట్టు వెల్లడించారు. కోఠి మహిళా కాలేజీ అభ్యర్థన మేరకు మహిళలకు మాత్రమే టాయిలెట్ వసతి ఉండటంతో వారికే మాత్రమే కేటాయించామని తెలిపారు.
మహిళా అభ్యర్థుల్లో 25% మంది 18, 19 నంబర్ గల సెంటర్లలో పరీక్షలకు హాజరయ్యారని, ఎంపికలోనూ కూడా ఎక్కువ నిష్పత్తిలో వారే ఉన్నట్టు పేర్కొన్నారు. ఎస్టీ క్యాటగిరీ టాప్ ర్యాంకర్ ఎరుకుల కులానికి చెందిన వారని తెలిపారు. ప్రిలిమ్స్ హాల్టికెట్లలో జిల్లా కోడ్, సెంటర్ కోడ్ ఉండటం చేత మెయిన్స్‌కు వేరే హాల్‌టికెట్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఉర్దూలో 10 మంది రాయగా, ఒక్కరు మాత్రమే ఎంపికైనట్టు వివరించారు. పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులకు సమాన మార్కులు రావడం సహజమని, మొత్తం మార్కులు సమానంగా ఉన్నప్పటికీ సబ్జెక్టుల్లో వేర్వేరు మార్కులొచ్చాయని తెలిపారు. పూజితారెడ్డి అనే అభ్యర్థి మార్కులు ఫోర్జరీ చేసి రీ కౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని లేఖ రాశారని, ఫోర్జరీ పత్రాన్ని సమర్పించినందుకు షోకాజ్ నోటీసు జారీచేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం 1:1 చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినా, ఏదైనా క్యాటగిరీలో అభ్యర్థులు లేకుంటే తదుపరి అభ్యర్థిని పిలుస్తామని తెలిపారు.
తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 16. టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది. 17,19,21,22 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనున్నది.