హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డు కులాల్లోని మాదిగలతోపాటు అన్ని ఉపకులాల వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఎస్సీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లలో కొన్ని కులాలు, ఉపకులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని, దీంతో ఇతర కులాలవారు అన్యాయానికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలని దళిత సంఘాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. ఈ అంశాన్ని పరిశీలించి, ఎస్సీలోని అన్ని కులాలకు సమాన వాటా దక్కేలా చూసేందుకు ప్రధాని సూచనతో క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మాదిగలతోపాటు ఇతర గ్రూపులవారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోవల్సిన చర్యలను కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నాయి. కమిటీలో కేంద్ర హోంశాఖ, సిబ్బంది-శిక్షణ శాఖ, గిరిజన వ్యవహారాలశాఖ, న్యాయశాఖ, సామాజిక న్యాయం సాధికారత శాఖలకు చెందిన కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ ఈ నెల 23న సమావేశం కానుంది.
డిమాండ్ న్యాయమేనన్న కమిటీలు
ఎస్సీల వర్గీకరణ చేపట్టాలన్న దళితసంఘాల డిమాండ్ న్యాయసమ్మతమేనని గతంలో అనేక కమిటీలు తేల్చిచెప్పాయి. తెలంగాణ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనలో ఉండగా.. పలు ఇతర న్యాయస్థానాల్లో కూడా ఇదే అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి.